విభజించు… సాధించు…

గమ్యం పెద్దగా కనిపించినప్పుడు వదిలేయడం కాదు చేయాల్సింది. చిన్నదిగా విభజించుకోవడం.

అవును కొన్ని సార్లు నీ గమ్యాన్ని చూసి నీకే భయం వేయొచ్చు. వంద మైళ్ళు పరుగెత్తాలి అని వినగానే నీ గుండె అక్కడే ఆగిపోవచ్చు, కాని దాన్ని ఒక్కొక్క మైలు వంద సార్లు పరుగెత్తాలి అని విభజించుకో, అప్పుడు నీ ముందు ఒకే మైలు, నీవు పరుగెత్తాల్సింది ఒకే మైలు. అలా ఒక వంద సార్లు పరుగెడితే సరిపోతుంది. అలాగే ఒక 15 పుస్తకాలు చదవాలి అని వినగానే నీ వల్ల కాదు అనిపించి పక్కన పడేయొచ్చు. కాని ఒకే పుస్తకం చదువు. ఒక్కటి చదవడం కష్టంగా అనిపించదు. అది అయ్యాక ఇంకొకటి, దాని తర్వాత మరొకటి. చాలా సులభం. ఇంత మాత్రానికే ప్రతి దాన్ని పెద్దగా ఊహించుకుని, భయపడి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోకు.
మొన్ననే ఒక సినిమా చూసాను. చింత కింది మల్లేశం అని. అందులో హీరోకి వాళ్ళమ్మ చెపుతుంది. ఏ పనైనా చిన్న, చిన్నగా చేసుకుని చేస్తే, కష్టంగా అనిపించదు. ఒక్కొక్కటిగా పూర్తి చేయడం వీలవుతుంది అని. ఎంత చక్కటి పాఠం అది. అలాంటి పాఠాలు చెప్పే అమ్ముంటే, మీకు ఆసక్తి ఉన్న ఏ పనైనా సరే చేయడం కష్టం అనిపించదు. ఆ మాటలు వింటుంటే నాకు గుర్తొచ్చిన మరో విషయం బ్రిటిష్ వారి “విభజించి పాలించు” అనే విధానం. అలాంటి విధానం వల్లే అంత పెద్ద భారత భూభాగాన్ని, ఎంతో బలమైన రాజ్యాలని సొంతం చేసుకోగలిగారు కదా అని.
జీవితం కూడా అంతే చాలా కష్టమైన దాన్ని కూడా విభజించుకుని చేసుకుంటూ పొతే ఎలాంటి పనైనా సరే, ఎంతటి లక్ష్యమైనా సరే కరిగి పోయి నీ చెంతకు చేరుతుంది. అంతే గాని ఉన్న దానినే భూతద్దం లో చూసుకుని భయపడితే చేయగలిగేదైనా కూడా నీ వల్ల కాదు అనే అనిపిస్తుంది. అందుకే ఇకనుంచి మీరు చేసే ఏ పనైనా సరే, కష్టం అనిపించినా లేక చేయలేనంత పెద్దగా అనిపించినా, నువ్వు చేయగలిగేంత చిన్న భాగాలుగా విడగొట్టుకొని చేసేందుకు ప్రయత్నించి చూడు. తప్పకుండ విజయం సాధిస్తావు.

RV Writings...

Comments

Popular posts from this blog

ఉన్నది ఒకటే జిందగి...

సమయాన్ని వృధా చేయకండి...