నూరుశాతం(100%) కోసం వెతుకులాటా…?
స్నేహంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు లేక భాగస్వామిలో కావచ్చు… ఎవరిలో అయినా సరే 100% కోసం ఎప్పుడూ వెతక్కండి.
ఎప్పుడైతే ఎదుటివారు నూరు శాతం పక్కాగా ఉండాలనుకుంటామో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. అది ఆ బంధాన్ని శాశ్వతంగా దూరం చేసుకోవడం వరకు కూడా వెళ్లొచ్చు. అందుకే ఎవరిలోనైనా సరే నూరు శాతం కోసం వెతకొద్దు, ఎందుకంటే మనుషులందరిలో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. బలాల్ని గుర్తించి ప్రోత్సహించడం, బలహీనతలని దిద్దుకునేలా సహకరించడం చేయాలి.
పొరపాట్లు చేస్తే క్షమించడం ప్రతీ బంధంలో వుండాల్సిన ముఖ్య లక్షణం. అలా చేయగలిగినప్పుడే ఏ బంధమైనా శాశ్వతంగా వుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో నూటికి నూరు శాతం పక్కాగా ఎవరూ వుండరు. మనుషులంతా అంతే, నేను ఎలా వున్నా సరే, ఎదుటివారు మాత్రం ఇలానే వుండాలి, అలానే ఉండాలి అనుకుంటాం. ఎవరికి వారు వాళ్ళు చేసేవి చాలా సరైనవిగా కనిపిస్తాయి కానీ ఎదుటివారు చేసేవి మాత్రం చిన్న పొరపాట్లని కూడా పెద్ద తప్పుగా భావించి నిందిస్తాం.
తప్పులు చేయడం మానవ సహజం.ప్రతి ఒక్కరూ చిన్నవో, పెద్దవో తప్పులు చేస్తూనే వుంటారు. వాటి నుంచి నేర్చుకుంటూ మరోసారి చేయకుండా జగ్రత్తపడతారు. కొంతమంది చేసిన తప్పునే మళ్లీ చేయొచ్చు. అంత మాత్రానికే నిందించడం సరైన పని కాదు. క్షమించడం అనే ఒక గొప్ప గుణాన్ని కలిగి వుండడం చాలా గొప్ప విషయం. ఆ గుణమే గనక లేకపోతే తప్పుల్ని వెతకడం, చిన్న చిన్న తప్పులకి కూడా చాలా ఎక్కువగా స్పందించడం జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఒక బంధాన్ని దూరం చేసుకొనే వరకు కూడా వెళ్లొచ్చు. చిన్న చిన్న పొరపాట్లని క్షమించలేక ఒక స్నేహాన్ని, బంధుత్వాన్ని, మరే బంధాన్నైనా కావచ్చు దూరం చేసుకోవడం అంటే ఉప్పు తక్కువయిందని కూర మొత్తం పడబోయటం లాంటిదే.
అందుకే ఎవరూ కూడా నూరు శాతం పక్కాగా వుండాలని ముందే ఒక నిర్ణయానికి రాకండి. చిన్న చిన్న పొరపాట్లని క్షమించి, వీలైతే వాటిని సరిదిద్దుకునే దిశలో వారికి సహకరించండి. ప్రతీ స్నేహాన్ని, బంధాన్ని, బంధుత్వాన్ని కాపాడుకోండి.
RV Writings...
Comments
Post a Comment